ప్రయాణం
మొన్న కొన్ని రోజుల కిందట నేను నంది హిల్స్ కి (బెంగళూరు నుండి 45 కి.మీ దూరంలో ఉంది) కొంతమంది మిత్రులతో వెళ్ళాను. అక్కడ శుక్రవారం కావడంతో ఎవరూ లేరు దాదాపు.... మేము బెంగళూరు నుండి సాయంత్రం 3 కి బయలుదేరి అక్కడ వెళ్ళేసరికి 4 అయ్యింది. వెళ్ళే దారిలో బెంగళూరు లోని ఒత్తిడిని దాటి వెళ్ళినట్టుగా ఉంది.. మేము దేవనహళ్ళి వరకు 100 కి.మీ/గం స్పీడ్ తో డ్రైవ్ చేసి, అక్కడ నుండి చిన్న చిన్న ఊర్లను దాటుతూ చివరికి కొండ పైకి నడపసాగాను.. నడుపుతున్నంతసేపు అటూ దూరంగా కనిపించే దట్టమైన నల్లని మేఘాల చాటున దాగి ఉన్న విశాలమైన నంది కొండ పైన చలిగాలి వేసి కప్పుకున్నట్టుగా మేఘాల మబ్బులతో నిండిపోయింది.. ఆహా ఆ దృశ్యం చూసి మేము కాసేపు కారును ఆపేసి అలా ఉండిపోయాము.. ఆ తర్వాత చిన్నగా మబ్బులలోకి కారును నడుపుకుంటూ వెళ్ళిపోయాము...
టిప్పు సుల్తాన్ వేసవి అతిథి గృహం
మేము టికెట్ తీసుకొని కోట లోకి వెళ్ళగానే ఒక చిన్న కొలను కనిపించింది.. ఆ కొలను ఒంటరిగా బిక్కుబిక్కు మంటున్నట్టుగా ఉంది.. ఎవరూ లేని ప్రదేశం అది.. ఏదో సినిమా షూటింగ్ కోసం లొకేషన్ లాగా ప్రశాంతంగా ఉంది.. అక్కడ ఉన్న వాతావరణం చూసి నా మనసు ఎక్కడో సుదూర ప్రాంతంలోకి వెళ్ళినట్టుగా ఉంది.. ఆ ప్రదేశం ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అక్కడే ఎప్పటినుంచో గూడు చేసుకున్న కోతులు కూడా నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటూ హాయిగా ఆ ప్రకృతిని ఆరాధిస్తున్నట్టుగా ఉన్నాయి.. అక్కడికి కొంచెం దూరంలో టిప్పు సుల్తాన్ వేసవి అతిథి గృహం ఉంది. ఆ గృహం ఎప్పటినుంచో ఎవరూ లేకపోవడంతో "నా ఏకాంతాన్ని మీరు భగ్నం చేయకండి" అని చెప్పనక్కర్లేదని చెబుతున్నట్టుగా ఉంది..
మబ్బులతో ఆటలు...
ఆ సుందరమైన ప్రదేశం నుండి కాస్త పైకి వెళ్ళాము అంతే, మేము మబ్బులో ఉన్నట్టుగా పైన నుండి లోకం మొత్తాన్ని గమనించే బ్రహ్మలాగా చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఆస్వాదించాము.. ఆ ప్రదేశం లోనుండి ఆ చల్లని వర్షాన్ని మేము వెక్కిరిస్తున్నంత ఎత్తులో ఉన్నాము.. కింద ఉన్న భూలోకం తడిసి ముద్దవుతుంటే.. మేము ఆ మబ్బుల పైన స్వారీ చేస్తున్నట్లు... మబ్బులను "ఆ వైపుకు వెళ్ళు, ఈ వైపుకు వెళ్ళు" అని ఆదేశాలిస్తున్నట్టుగా ఉంది.. "నంది కొండల్లో వాగుల్లో నల్లమొబ్బు నీడల్లో" అన్న పాట ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు నా మిత్రుడు.. ఆ కొండ వాగుల్లో ఒక్కసారిగా మమ్మల్ని మేము మరచిపోయాము.. "ఈ మబ్బుల ముసుగును తీసి కాస్త సూర్యుడిని చూడనివ్వు మిత్రమా" అని మబ్బులతో ఎంత వేడుకున్నా.. "మిత్రమా, నాకు నేలను తడిపే పని ఉంది ఈ రోజు, నీకు అంత సమయం కేటాయించలేను" అన్నట్టుగా మబ్బులు సూర్యుడిని కప్పేసాయి.. కాసేపు సూర్యాస్తమయం కోసం వేచిచూసి మిత్రుడు "సరే మిరా" అనడంతో తిరిగి మా ప్రయాణం కొనసాగించాము.
ఎత్తైన భవనం, కమ్మని వంట...
ఆ విశాలమైన భూలోకం నుండి కాస్త ముందుకు రాగానే అక్కడ ఒక చిన్న హోటల్ ఉంది. అది నంది కొండలోని లోయకు కాస్త అంచున కట్టించారు.. ఆ దృశ్యం చూసి, వాతావరణం కూడా చల్లగా ఉండటంతో అక్కడ ఏదైనా కాస్త వేడివేడిగా తినాలి అనుకొని ఆ హోటల్లోకి చిన్నగా జారుకొని లోయకు పక్కగా కూర్చొని అక్కడ కొన్ని వేడివేడి వంటలు ఆర్డర్ చేసాము.. అటు లోయ, ఇటు చల్లని గాలి మధ్యలో వేడివేడిగా గోబీ, ఇంకేముంది కుమ్మేసాము.. ఇంతలో చిమ్మచీకటి కమ్మేసింది ఆ ప్రదేశం అంతా.. వీధి లైట్లు లేకపోవడంతో ప్రదేశం అంతా చీకటిగా ఉంది.. కాని అక్కడ నుండి చూస్తే ఇటు బెంగళూరు, అటు చిక్కబళ్ళాపూర్, ఇంకాస్త ముందుకు బాగేపల్లి చాలా అందమైన దీపాల అలంకరణతో ఉంచిన కార్పెట్ లాగా ఉంది. అప్పటికే టైం చాలా అయ్యిందటంతో వెనక్కు తిరిగి వస్తున్నంతసేపు సరదాసరదాగా నవ్వుకుంటూ దిగేసాము..
ఇదండి మా నంది కొండల అద్భుతమైన అనుభవం...
మీ,
కృష్ణ సి
1 comment:
"మబ్బులను ఆ వైపుకు వెళ్ళు ఈ వైపుకు వెళ్ళు అని ఆదేసలిస్తున్నాటుగా ఉంది.. "
:) మొత్తంగా బాగా వర్ణించావు కృష్ణా!
Post a Comment